హైదరాబాద్: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను ఉద్దేశించి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా సీవీ ఆనంద్‌ను సమర్థుడైన పోలీసు అధికారిగా తాను భావిస్తున్నానని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం తెలంగాణ పోలీసుల వ్యవహారశైలిపై పలు సందేహాలు వ్యక్తం చేశారు.తనను, తన కదలికలను పర్యవేక్షించేందుకు తెలంగాణ పోలీసులకు చెందిన ఏసీపీ స్థాయి అధికారిని నియమించినట్లు తనకు సమాచారం అందిందని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడి ఆదేశాల మేరకే ఈ పర్యవేక్షణ జరుగుతోందని తనకు తెలిసిందని ఆయన ఆరోపించారు.ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసు వ్యవస్థపై ఆయన పలు ప్రశ్నలు సంధించారు. పోలీసులు రాజ్యాంగం, చట్టబద్ధమైన అధికారిక ఆదేశాల మేరకు పనిచేస్తున్నారా? లేక ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ఆదేశాలతో పనిచేస్తున్నారా? అని ప్రశ్నించారు.తెలంగాణ పోలీసులు చట్టానికి, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థకు జవాబుదారీగా ఉండాలని ధర్మపురి అరవింద్ అన్నారు. రాజకీయ కుటుంబాల ఆదేశాలకు అనుగుణంగా పోలీసు వ్యవస్థ పనిచేయకూడదని స్పష్టం చేశారు.డీజీపీ సీవీ ఆనంద్ సమర్థుడైన అధికారిగా తనకు ఉన్న అభిప్రాయాన్ని ప్రస్తావించిన ధర్మపురి అరవింద్.. ప్రస్తుతం పోలీసు వ్యవస్థపై వస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Also Read
















