asr telugu |హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి భారీ ఆర్థిక భరోసా కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక బీమా పథకాన్ని అమలు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి రూ.1 కోటి వరకు బీమా అందేలా ఈ పథకాన్ని రూపొందించినట్లు వెల్లడించారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 12.91 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు బీమా కవరేజ్ వర్తిస్తుందని తెలిపారు. ఈ బీమా పథకానికి ప్రభుత్వంపై, ఉద్యోగులపై ఎలాంటి ప్రీమియం భారం ఉండదని స్పష్టం చేశారు.
ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.1 కోటి
ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ.1 కోటి బీమా అందుతుంది. ఇతర ప్రయోజనాలను కలిపి కుటుంబానికి మొత్తం రూ.1.20 కోట్ల వరకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. విమాన ప్రమాదంలో మరణిస్తే బీమా మొత్తం రూ.2 కోట్ల వరకు అందుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
సహజ మరణానికి కూడా రూ.10 లక్షల వరకు ప్రయోజనం కల్పించేలా పథకం ఉంది.
16 బ్యాంకులతో ఒప్పందం
ఈ బీమా పథకాన్ని 16 బ్యాంకులతో ఒప్పందం ద్వారా అమలు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఇప్పటివరకు 98 క్లెయిమ్‌లు పరిష్కరించినట్లు వెల్లడించారు.
సింగరేణి పరిధిలో వచ్చిన 50 క్లెయిమ్‌లను పరిష్కరించగా, విద్యుత్ శాఖ పరిధిలో వచ్చిన 15 క్లెయిమ్‌లను కూడా పరిష్కరించినట్లు తెలిపారు. విద్యుత్ శాఖలో ఇప్పటివరకు రూ.15 కోట్లకు పైగా బీమా చెల్లింపులు జరిగినట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వచ్చిన 33 క్లెయిమ్‌లలో 24 క్లెయిమ్‌లను ఇప్పటికే పరిష్కరించినట్లు తెలిపారు.
సింగరేణితో ప్రారంభమై.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ
తొలుత సింగరేణి ఉద్యోగులతో ఈ బీమా పథకానికి శ్రీకారం చుట్టినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అనంతరం 2025లో ఇంధన శాఖ ఉద్యోగులకు ఈ పథకాన్ని విస్తరించారు.
2026 జూన్ 25 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ బీమా పథకం వర్తించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి 2024 జూన్ 26న ఆర్థిక శాఖ 77వ జీవో జారీ చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ బీమా విధానంపై కేంద్రం అధ్యయనం
తెలంగాణలో అమలు చేస్తున్న ఉద్యోగుల బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అధ్యయనం చేసిందని భట్టి విక్రమార్క తెలిపారు. ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ బీమా విధానంపై ఆసక్తి చూపుతున్నాయని పేర్కొన్నారు.
ఉద్యోగులకు హెల్త్‌కార్డులు
బీమాతో పాటు ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్‌కార్డులు కూడా తీసుకొచ్చామని డిప్యూటీ సీఎం తెలిపారు. దశాబ్దాలుగా ఉద్యోగులు కోరుతున్న క్యాష్‌లెస్ వైద్య సేవల డిమాండ్‌కు పరిష్కారం చూపామని అన్నారు.
హెల్త్‌కార్డు ద్వారా క్యాష్‌లెస్ ట్రీట్మెంట్తో పాటు CGHS ప్యాకేజీ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. హెల్త్‌కార్డు పథకం కోసం రూ.240 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.
ఉద్యోగుల సంక్షేమానికి బీమా, ఆరోగ్య భద్రతకు హెల్త్‌కార్డు అందించడం ద్వారా ఉద్యోగ కుటుంబాలకు ఆర్థిక, వైద్య భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు.
ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి
















