పులివెందుల: ఎన్నో ఏళ్లుగా తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న పులివెందుల నియోజకవర్గ ప్రజలకు ఊరట కలిగించేలా మెగా వాటర్ గ్రిడ్ పథకం పనులు వేగంగా పూర్తవుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో గతంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించి అధికారులు వేగవంతం చేశారు.జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకాల కింద చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.280 కోట్ల నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం ప్రాజెక్టు పనుల్లో దాదాపు 96 శాతం పూర్తికాగా, పైప్లైన్ నిర్మాణం 99 శాతం పూర్తయినట్లు తెలిపింది.ప్రాజెక్టులో భాగంగా 1,111 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణానికి గాను 1,106 కిలోమీటర్లు పూర్తయ్యాయి. కీలకమైన ఇంటేక్ వెల్ పునరుద్ధరణ పనులు కూడా పూర్తయ్యాయి. రోజుకు 65 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో నీటి శుద్ధి ప్లాంట్ల పనులు తుది దశకు చేరుకున్నాయి. ఓవర్హెడ్ ట్యాంకులు, గ్రౌండ్ లెవల్ రిజర్వాయర్ల నిర్మాణం కూడా దాదాపు పూర్తయ్యింది.పులివెందుల పట్టణం, గ్రామీణ ప్రాంతాలతో పాటు సింహాద్రిపురం మండలంలో పథకానికి సంబంధించిన పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. లింగాల మండలంలోని 27 ఆవాసాల్లో 24 ప్రాంతాలకు తాగునీటి సరఫరా అందించే ఏర్పాట్లు పూర్తయ్యాయి.గతంలో నిధులు, పరిపాలనా సమస్యల కారణంగా పనులు నెమ్మదించినప్పటికీ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లినట్లు అధికారులు పేర్కొన్నారు. పులివెందులతో పాటు పరిసర ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయడానికి చర్యలు కొనసాగుతున్నాయి.
పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం.. తుది దశకు పనులు



















