సరైన వైద్య అర్హతలు లేకుండానే డాక్టర్లుగా చెలామణి అవుతూ ప్రజలకు చికిత్స అందిస్తున్న ఆరుగురు నకిలీ వైద్యులను హైదరాబాద్ కమీషనర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సోమవారం నిర్వహించిన తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు ఎలాంటి అనుమతులు, వైద్య అర్హతలు లేకుండానే క్లినిక్‌లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు నిర్వహిస్తూ రోగులకు ఇంజెక్షన్లు, ఐవీ సెలైన్లు ఇవ్వడంతో పాటు కొన్ని సందర్భాల్లో సర్జికల్ కుట్లు కూడా వేస్తున్నట్లు గుర్తించారు.మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహమత్‌నగర్‌లో నిర్వహిస్తున్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌పై దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ప్రాంతంలో మాజీ నర్సుగా పనిచేసిన మహిళ అనుమతులు లేకుండా క్లినిక్ నిర్వహిస్తూ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.జూబ్లీహిల్స్, వెంకటగిరి ప్రాంతంలో డిగ్రీ చదివిన వ్యక్తి క్లినిక్ నిర్వహిస్తూ రోజుకు పలువురు రోగులకు చికిత్స అందిస్తున్నట్లు తేలింది. ఫిల్మ్‌నగర్‌లో ఫార్మసీ నిర్వహిస్తున్న మరో వ్యక్తి తన కుమార్తె వైద్య విద్యకు సంబంధించిన వివరాలను ఉపయోగించుకుని తానే డాక్టర్‌గా చెలామణి అవుతున్నట్లు పోలీసులు తెలిపారు.బోరబండలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసిన అనుభవంతో ఓ వ్యక్తి అనధికారికంగా క్లినిక్ నిర్వహిస్తూ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు గుర్తించారు.దాడుల్లో వివిధ రకాల ఇంజెక్షన్లు, యాంటీబయాటిక్స్, గడువు ముగిసిన మందులు, సెలైన్ బాటిళ్లు, సిరంజిలు, బీపీ మెషిన్లు, స్టెతస్కోప్‌లు, సర్జికల్ పరికరాలు తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సామగ్రి విలువ వేల రూపాయల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.టాస్క్‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అరెస్టు చేసిన నిందితులను, స్వాధీనం చేసుకున్న సామగ్రిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించినట్లు తెలిపారు.
నకిలీ వైద్యుల ముఠా గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్















