అమరావతి: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి సహజ రక్షణ కవచం ఏర్పాటు చేసే లక్ష్యంతో చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా తాటి వనాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. తాటి కాయల సీజన్ మొదలుకావడంతో రాష్ట్ర అటవీ శాఖ తాటి గింజల సేకరణ, నాటే కార్యక్రమాన్ని చేపట్టింది.గ్రేట్ గ్రీన్ వాల్ మూడంచెల ప్రణాళికలో మడ అడవులకు మొదటి అంచెలో, తాటి వనాలకు రెండో అంచెలో ప్రాధాన్యం ఇచ్చారు. తీర ప్రాంతాల్లో తరచూ ఎదురయ్యే తుపాను గాలులు, బలమైన సముద్ర గాలుల ప్రభావాన్ని తగ్గించడంలో తాటి చెట్లు సహజ గాలి నిరోధక వ్యవస్థగా పనిచేస్తాయని అధికారులు పేర్కొంటున్నారు.రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతం వెంబడి 5,499 హెక్టార్లలో తాటి వనాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం సుమారు 55 లక్షల తాటి గింజలు అవసరమవుతాయని అటవీ శాఖ అంచనా వేసింది. ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు గ్రామీణ ప్రజలు, వివిధ ప్రభుత్వ విభాగాల సహకారంతో 13 లక్షల తాటి గింజలను సేకరించారు. ఇప్పటికే 1.65 లక్షల గింజలను పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలు, విద్యార్థులు, ప్రజల భాగస్వామ్యంతో నాటినట్లు అధికారులు తెలిపారు.ఉప్పు నేలలు, ఇసుక, బుసకతో కూడిన తీర ప్రాంత నేలల్లోనూ తాటి చెట్లు పెరిగే సామర్థ్యం కలిగి ఉంటాయి. బలమైన వేర్లతో నేలను గట్టిగా పట్టుకోవడం ద్వారా తీర కోతను తగ్గించడంలోనూ ఇవి కీలకంగా ఉంటాయి. పక్షులు, సరిసృపాలకు ఆవాసంగా నిలుస్తూ జీవ వైవిధ్య పరిరక్షణకు కూడా దోహదపడతాయి.తాటి గింజల సేకరణ, నాటడం, మొక్కల సంరక్షణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మొలకెత్తిన తాటి మొక్కలను పశువుల నుంచి రక్షించాలని, అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బందికి సహకరించాలని కోరారు. స్థానిక ప్రజలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
తీరానికి సహజ రక్షణ కవచంగా తాటి వనాలు.. 55 లక్షల గింజలు నాటే లక్ష్యం



















