హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రజా పాలనా? లేక ఎమర్జెన్సీ పాలనా? అని ప్రశ్నించారు.ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై దాడికి కుట్ర జరుగుతోందని ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అక్రమంగా హౌస్ అరెస్ట్ చేస్తున్నారని, మరోవైపు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వైపు వెళ్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలను పోలీసులు స్వేచ్ఛగా వదిలేస్తున్నారని విమర్శించారు.“అసెంబ్లీలో ఉండాల్సిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గౌరారం వద్ద ఎందుకు కాపు కాస్తున్నారు? కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఏం పని?” అని ఆయన ప్రశ్నించారు. అక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను ఎందుకు అదుపులోకి తీసుకోవడం లేదని నిలదీశారు.కేసీఆర్‌పై దాడికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలను కంటైనర్లలో తరలిస్తున్నారని, పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్నారని ఎర్రోళ్ల ఆరోపించారు. కేసీఆర్ ఇంటిపై దాడికి ప్రయత్నాలు జరుగుతున్నా పోలీసు యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హింసను ప్రేరేపిస్తున్నారా? అని ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను హౌస్ అరెస్ట్ చేస్తూ, ప్రతిపక్ష నేత ఇంటిపై దాడికి ప్రయత్నాలను అడ్డుకోకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.కేసీఆర్‌పై దాడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లోనే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. హోం మంత్రిగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో శాంతిభద్రతలను సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. “ప్రజా పాలన ముసుగులో పోలీసుల రాజ్యం నడుస్తోంది” అని ఆరోపించారు.ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల నిరసనలకు ఒక న్యాయం, అధికార పార్టీకి మరో న్యాయం ఎలా ఉంటుందని ఎర్రోళ్ల ప్రశ్నించారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వద్ద జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, అక్కడ ఉన్న కవ్వంపల్లి సత్యనారాయణను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ వ్యవహారంపై తెలంగాణ డీజీపీ స్పందించాలని కోరారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..















