హైదరాబాద్: తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. విద్యార్థుల బకాయిలపై ‘బీజేపీ లడాయి’ పేరుతో హైదరాబాద్లో బీజేపీ నేతలు నిరసనకు దిగారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.స్టేట్ బీజేపీ చీఫ్ రామచందర్రావు చేపట్టిన నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.15 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బకాయిల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు.25 లక్షలకు పైగా విద్యార్థులకు ఇంకా రీయింబర్స్మెంట్ అందలేదని రామచందర్రావు పేర్కొన్నారు. ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించి విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీజేపీ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తోంది. మరోవైపు, బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం తీసుకునే చర్యలపై విద్యార్థులు, ప్రైవేట్ విద్యాసంస్థలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఫీజుల బకాయిలపై బీజేపీ పోరుబాట.. ప్రభుత్వంపై రామచందర్రావు ఫైర్















