రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నప్పటికీ.. చార్జీల విషయంలో ప్రయాణికులపై అదనపు భారం పడుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పండుగ రద్దీని క్యాష్ చేసుకునేలా అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు సాధారణ చార్జీ సుమారు రూ.290 ఉండగా.. పండుగ సందర్భంగా 1:50 రూల్ పేరుతో అదనంగా రూ.100 నుంచి రూ.150 వరకు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. మెట్రో డీలక్స్ స్పెషల్ బస్సుల్లో హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు రూ.400 వరకు చార్జీ వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సూపర్ లగ్జరీ బస్సుల్లోనూ అదనపు చార్జీల బాదుడు తప్పడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు.మరోవైపు, కొన్ని స్పెషల్ బస్సుల్లో ప్రయాణికులు ఎక్కిన తర్వాత మార్గమధ్యంలో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. జర్నలిస్టులకు వర్తించే 1/3 రూల్ విషయంలోనూ స్పెషల్ బస్సుల్లో స్పష్టత లేకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆప్షన్ చూపించకుండా చార్జీలు వసూలు చేస్తున్నారని కొందరు జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చార్జీల పెంపుపై ప్రయాణికులు ప్రశ్నిస్తే ఆర్టీసీ సిబ్బంది నుంచి పొంతన లేని సమాధానాలు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. పండుగ సమయంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా స్పష్టమైన చార్జీల వివరాలను ముందుగానే ప్రకటించాలని, అదనపు వసూళ్లపై అధికారులు దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
రాఖీ పండుగ పేరుతో ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లో చార్జీల బాదుడు















