హైదరాబాద్: పిల్లలు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాను వినియోగించే విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు సోషల్ మీడియాలో ఎమోజీలను ఉపయోగించే సమయంలో వాటి వెనుక ఉన్న అర్థాలను తెలుసుకోవాలని, తెలియని వ్యక్తులతో ఆన్‌లైన్‌లో పరిచయాలు పెంచుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.పిల్లలు సోషల్ మీడియా ద్వారా కొత్త వ్యక్తులతో పరిచయం పెంచుకునే అవకాశం ఉండటంతో.. తల్లిదండ్రులు వారి ఆన్‌లైన్ కార్యకలాపాలపై అవగాహన కలిగి ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తెలియని వ్యక్తులు పంపే సందేశాలు, లింకులు, ఫొటోలు లేదా ఇతర కంటెంట్‌ను పిల్లలు ఓపెన్ చేయకుండా తల్లిదండ్రులు వారికి అవగాహన కల్పించాలి.అలాగే పిల్లల మొబైల్ వినియోగంపై తల్లిదండ్రులు నియంత్రణతో పాటు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఏదైనా అనుమానాస్పద ఆన్‌లైన్ పరిచయం లేదా వేధింపులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు.సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంది. పిల్లల భద్రతకు సంబంధించిన సమస్యలపై 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ను కూడా సంప్రదించవచ్చు.తల్లిదండ్రులు పిల్లలతో సోషల్ మీడియా వినియోగంపై తరచూ మాట్లాడటం, వ్యక్తిగత సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పంచుకోకూడదని వివరించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
పిల్లలకు ఎమోజీల పట్ల జాగ్రత్త.. తల్లిదండ్రులకు తెలంగాణ పోలీసులు కీలక సూచనలు.















