హైదరాబాద్: భర్త మరణించిన తర్వాత మహిళలు బొట్టు, గాజులు, కాటుక, గజ్జెలు వంటి అలంకరణలకు దూరంగా ఉండాలనే సంప్రదాయంపై సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ఆచారాలు మహిళల వ్యక్తిగత ఎంపికకు సంబంధించిన అంశాలుగా చూడాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.తన తల్లి గురించి ప్రస్తావించిన అనసూయ.. చిన్నప్పటి నుంచి బొట్టు, గాజులు, కాటుక, గజ్జెలు, పూలు వంటి అలంకరణలతో ఎంతో అందంగా కనిపించేవారని గుర్తుచేసుకున్నారు. అయితే తండ్రి మరణించిన తర్వాత తన తల్లి ఆ అలంకరణలకు దూరంగా ఉండటం తనను బాధించిందని తెలిపారు.ఆడపిల్లలకు చిన్నతనం నుంచే అలంకరణలను పరిచయం చేస్తున్నప్పుడు, పెళ్లి తర్వాత వాటిని కేవలం భర్తతోనే ఎందుకు ముడిపెట్టాలని అనసూయ ప్రశ్నించారు. భర్త మరణించిన తర్వాత తప్పనిసరిగా బొట్టు, గాజులు తొలగించాలనే నిబంధన ఎక్కడ ఉందని ఆమె ప్రశ్నించారు.అయితే తాను ఎవరి విశ్వాసాలను లేదా సంప్రదాయాలను కించపరచడం లేదని, ఇవి తన వ్యక్తిగత ఆలోచనలు మాత్రమేనని అనసూయ స్పష్టం చేశారు. ప్రతి మహిళ తన జీవితాన్ని, తన అలంకరణను తన ఇష్టానుసారం నిర్ణయించుకునే స్వేచ్ఛ కలిగి ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.అనసూయ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మహిళలకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలని ఆమె అభిప్రాయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు సంప్రదాయాలకు సాంస్కృతిక, భావోద్వేగ ప్రాధాన్యం ఉందని పేర్కొంటున్నారు. దీంతో ఆమె వ్యాఖ్యలు మరోసారి సంప్రదాయం, మహిళా స్వేచ్ఛపై చర్చకు దారితీశాయి.
భర్త మరణిస్తే గాజులు, బొట్టు ఎందుకు తీసేయాలి? అనసూయ ప్రశ్నలు.



















